కడప జిల్లా పర్యటనలో భాగంగా సిద్ధవటం కోట, ఆలయం, పరిసర ప్రాంతాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ . వైయస్సార్ కడప జిల్లాలో పవిత్ర పెన్నా నది ఒడ్డున ఉన్న సిద్ధవటం ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం సిద్ధవటం ప్రాంతాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. సిద్ధవటంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సిద్ధవటం కోటను, కోట ప్రాకారాలను, ముఖద్వారాలను, సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, నంది విగ్రహం, పురాతన శిల్పాలు, కోనేరును మంత్రి దుర్గేష్ పరిశీలించారు. అనంతరం టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించిన బిస్మిల్లా షావలి దర్గా, మసీదును దర్శించుకొని ప్రార్థించారు. కోటగోడలో సొరంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించిన వైవిధ్యాన్ని, చక్రయంత్రం చారిత్రక నేపథ్యం తదితర వివరాలను అధికారులను అడిగి సిద్ధవటం చరిత్ర తెలుసుకొని మంత్రి దుర్గేష్ తెలుసుకుని మంత్ర ముగ్గులయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సిద్ధవటం ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంతకుముందు సిద్ధవటం ప్రాంతానికి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ గారికి స్థానిక కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.