కడపలో నిర్వహించిన బలిజ, కాపు, ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం – కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ : త్వరలోనే పర్యాటక కేంద్రాలుగా గండికోట, సిద్ధవటం ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ కడప: రాబోయే ఐదేళ్ల కాలంలో రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం కడప పట్టణంలోని మేడా కళ్యాణమండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాపు, బలిజ, ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మాన సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్, విశిష్ట అతిథిగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.. రాయలు ఏలిన రతనాలసీమలో పర్యాటకాన్ని వృద్ధి చెందించి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాటి కాలం చెరువులు, బావులు, అవశేషాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.. ప్రత్యేకించి గండికోట, సిద్ధవటం లాంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు.. త్వరలోనే సూర్యలంకను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు మంజూరైన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కాపు, బలిజ ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.. రాయలసీమలో దళితులు, వెనుకబడిన వర్గాలు, కాపులు, బలిజలు ఇలా అందరికీ సముచిత స్థానం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుగు ఔన్నత్యాన్ని విశ్వ వినువీధుల్లో వినిపించిన సాహితీ సమరాంగ సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయల గురించి మంత్రి ప్రస్తావించారు. సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ద్వారపు వెంకటస్వామి నాయుడు, దేశంలో క్రికెట్ రంగంలో మొట్టమొదటి క్రికెటర్ గా పేరొందిన సీకే నాయుడు, తన కళ్ళల్లోనే అద్భుతంగా నవరసాలని పలికించగలిగిన అభినయశ్రీ మహానటి సావిత్రి, విశ్వనట చక్రవర్తిగా కీర్తి పొందిన నటులు ఎస్వీ రంగారావు, భారతదేశ వ్యాప్తంగా పేరొందిన కటారి రాందాస్, వ్యాపార రంగంలో పేరుగాంచిన భాస్కర లక్ష్మీనారాయణ శెట్టి, కాపు కులానికి చిహ్నంగా ఉద్భవించిన వంగవీటి మోహన రంగా, సినిమా రంగంలో ఉద్దండడుగా కీర్తిగాంచిన మెగాస్టార్ చిరంజీవి తదితరుల ప్రస్థానాన్ని మంత్రి దుర్గేష్ వివరించారు. కాపు, బలిజ సామాజిక వర్గాలకు చెందిన వీరందరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్రంలో నాటి దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ సీట్ల పంపకాల్లో ముందుకెళ్ళిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ క్రమంలో ఆయన చేసిన త్యాగాలను మంత్రి దుర్గేష్ క్లుప్తంగా వివరించారు.. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వెన్నుముకగా ఏ విధంగా నిలిచారన్న విషయాన్ని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. సమైక్య శక్తిగా ముందుకు వెళ్దామని రాబోయే రోజుల్లో అందరికీ సమచిత ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా రావడం ఒక్కోసారి లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా అనే సినిమా డైలాగును ఉదహరిస్తూ సభికులను మంత్రి దుర్గేష్ ఉత్సాహపరిచారు.తనకు ఎమ్మెల్యేగా, పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని తెలుపుతూ ప్రపంచ దేశాల్లోనే సమర్థ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తారని తెలిపారు. ఏదైనా సమస్యతో సెక్రటేరియట్ లోని తన పేషీకీ వచ్చిన వారందరి సమస్యలు పరిష్కరిస్తున్నానని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పేదల కంట కన్నీరు రాకుండా చూసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఊరు వాడ తిరుగుతూ నూటికి నూరు శాతం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన నిబద్ధత కలిగిన ప్రతి ఒక్క నేతకు పేరుపేరున మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం ఖూనీ అవ్వడం చూసామని, ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, కాపు కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తనయుడు నాగరాజు, బలిజ సంఘం నేతలు హరిప్రసాద్, శ్రీనివాసులు, రాయలసీమ నేతలు ఏ. శ్రీనివాసులు, నాగేంద్ర, దుర్గా మల్లికార్జున్, జనసేన జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, కృష్ణ, కాపు జేఏసీ కన్వీనర్ దాసరి రాము, చిత్తూరు జిల్లా మహిళా నేత కీర్తన, అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన కాపు, బలిజ సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.