సీపీఐ శత వార్షికోత్సవాలను పార్టీ శ్రేణులు వాడవాడలా ఘనంగా నిర్వహించి వందేళ్ళ ఉద్యమ పోరాట చరిత్ర వివరించాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సీపీఐ శత వార్షికోత్సవాల వాల్ పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో వందలాది మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారన్నారు.భూమి కోసం, భుక్తి కోసం, శ్రమ జీవుల బానిసత్వ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులను కాల్చి చంపారన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో 200 మంది, జిల్లాలో జరిగిన జమిందారీ వ్యతిరేక రైతాంగ పోరాటంలో 18 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను తుపాకీ గుళ్ళకు అర్పించారన్నారు. ప్రజల జీవనోపాధి, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం, దోపిడీ రహిత సమాజ సాధన దిశగా వందేళ్ళుగా సీపీఐ నిర్విరామంగా పోరాడుతుందన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలోను సీపీఐ అనిర్వచనీయమైన పాత్ర నిర్వహించిందన్నారు. స్వాతంత్ర్యానంతరం కార్మికులు, కర్షకులు,రైతులు,మహిళలు, విద్యార్థులు యువత, దళిత,గిరిజన సమస్యలపై సీపీఐ అలుపెరుగని పోరాటాలు సాగించిందన్నారు. దున్నేవానిదే భూమి అంటూ సీపీఐ సాగించిన పోరాటఫలితంగా పేదలకు లక్షలాది ఎకరాలు భూమి పంపిణీ జరిగిందన్నారు. రాజభరణాలు రద్దు, బ్యాంకుల జాతీయకరణ సీపీఐ పోరాట ఫలితమేనన్నారు. ప్రస్తుత నరేంద్రమోదీ మతతత్వ, కార్పోరేట్ అనుకూల రైతాంగ, కార్మిక, ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మతసామరస్య సాధనకు, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సీపీఐ ఎదురొడ్డి నిలచి పోరాడుతుందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాస్, యేలేటి విజయానంద్, విద్యార్ధి నాయకుడు వై.జోయల్ తదితరులు పాల్గొన్నారు.
