రూ. 50 కోట్లు మంజూరు చేయడం అభినందనీయం
సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం బ్యాచ్ అనవసర ప్రచారం
గతంలో జగన్ పరదాలు కట్టుకుని వచ్చారని ఎద్దేవా
సీఎం ఆరు గంటల పాటు పర్యటించినా ఎవరికీ ఇబ్బంది లేదు
పర్యటన విజయవంతం చేసిన అధికారులు, శ్రేణులకు కృతజ్ఞతలు – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
రాబోయే రోజుల్లో తణుకు పట్టణ రూపురేఖలు మార్చే విధంగా ఆద్యంతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సాగిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణ అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కే విధంగా రూ. 50 కోట్లు నిధులు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారన్నారు. నిర్ణీత సమయంలోనే సంబంధిత నిధులను ఖర్చు పెట్టే విధంగా సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసిన అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ముఖ్యంగా ఎన్టీఆర్ పార్కు, హోల్‌సేల్ కూరగాయల మార్కెట్, ఐక్యనగర్లోని పార్కు అభివృద్ధి చేయడంతోపాటు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అమలయ్యే విధంగా దిశనిర్ధేశం చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ పార్కునకు కొత్త రూపు తీసుకువచ్చే విధంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విధంగా జీఅండ్‌వీ కెనాల్ బండ్ రోడ్డును రాష్ట్రపతి రోడ్డుకు సమాంతరంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే అర్నెల్లు కాలంలో 42 పార్కులను అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారని చెప్పారు. ముఖ్యంగా 100 మైక్రాన్లోపు ఉన్న ప్లాస్టిక్ నిషేధించే విధంగా భవిష్యత్తులో బయో డీగ్రేడబుల్ సంచులు, గుడ్డ సంచులు వాడే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురానున్నట్లు తెలిపారు. దాదాపు గంటన్నరపాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపే విధంగా పార్టీ విధివిధానాలు సూచించినట్లు చెప్పారు.
గతంలో పరదాలు కప్పుకుని వచ్చిన జగన్
వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోడ్ షోలో జనం లేరని వీడియోలు వైరల్ చేశారని ఎద్దేవా చేశారు. కేవలం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మాత్రమే తణుకులో వాహనాల్లో సీఎం చంద్రబాబు తిరిగారు తప్ప ఎలాంటి రోడ్‌షోలు నిర్వహించలేదని అన్నారు. ఎలాంటి జనసమీకరణ లేకుండా వాహనాలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కార్యక్రమాలను రూపకల్పన చేసినట్లు చెప్పారు. గతంలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తణుకులో ఇదే జిల్లా పరిషత్ పాఠశాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన సమయంలో పరదాలు కట్టుకుని రోడ్లుపై బారికేడ్లు ఏర్పాటు చేసి చెట్లు నరికేసి షాపులు మూయించిన సంఘటనలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. అప్పట్లో జగన్మోహన్రెడ్డి పర్యటన ప్రస్తుతం జరిగిన చంద్రబాబు పర్యటనలో వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దాదాపు ఆరు గంటలపాటు తణుకు పట్టణంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గడిపినప్పటికీ ప్రజలకు, వ్యాపారులకు, ట్రాఫిక్‌నకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో జగన్మోహన్రెడ్డి పర్యటన సమయంలో అభివృద్ధి కోసం చిల్లిగవ్వ కూడా సాధించుకోలేని అసమర్థ పాలకులని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకు పర్యటనలో ఇచ్చిన స్ఫూర్తితోపాటు ఆయన మార్గదర్శకత్వంలో తణుకు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పష్టం చేశారు. ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ’ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ఘన స్వాగతం పలికి ఆయన పాల్గొన్న కార్యక్రమాలను విజయవంతం చేసిన తణుకు నియోజకర్గ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ అస్మి, ఇతర శాఖల ఉన్నతాధికారులు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సంకల్పంలో భాగస్వాములయ్యే విధంగా ప్రతిఒక్కరు సంఘీభావం తెలియజేయడం సంతోషకరమని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.