- ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి
మహిళా మరియు శిశు కౌన్సెలింగ్ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు గత ఐదేళ్లలో కేటాయించిన నిధులు, ఏపీతో పాటు ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న మహిళా మరియు శిశు కౌన్సెలింగ్ కేంద్రాల సంఖ్య, మహిళా మరియు శిశు మానసిక నిపుణులు, థెరపిస్ట్‌లు మరియు సైకియాట్రిస్ట్‌ల పోస్టుల సంఖ్య, కౌన్సెలింగ్ కేంద్రాలలో ఖాళీల వివరాలపై పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ శుక్రవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
హింసకు గురై కష్టాల్లో ఉన్న మహిళలకు వన్ స్టాప్ సెంటర్లు అండగా నిలిచి సహాయాన్ని అందిస్తాయని,
నిరుపేద మహిళలకు వైద్య సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం, పోలీసు సహాయం, మానసిక సామాజిక కౌన్సెలింగ్ వంటి సేవలు అందుతాయని, నేరాల రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఒకటి, అవసరమైతే అదనంగా మరొక ఓ.ఎస్.సి ఏర్పాటు చేస్తారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 894 ఓ.ఎస్.సిలకు గాను, ఆంధ్రప్రదేశ్లో 26, ఏలూరు జిల్లాలో ఒకటి చొప్పున ఉన్నాయని, గత ఐదేళ్లలో వన్ స్టాప్ సెంటర్ల కోసం రూ.13.94 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
కేంద్ర మంత్రిత్వ శాఖ ‘మిషన్ వాత్సల్య’ పేరిట కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేస్తోందని, సంరక్షణ సేవలు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్ సేవలు రెండింటినీ కలిగి ఉంటుందని, పునరావాస చర్యగా పిల్లల సంరక్షణ సంస్థల ద్వారా సంస్థాగత సంరక్షణ అందించబడుతుందని, వయస్సుకు తగిన విద్య, వృత్తిపరమైన శిక్షణ, వినోదం, ఆరోగ్య సంరక్షణ, కౌన్సెలింగ్ మొదలైన వాటికి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్‌లో కౌన్సిలింగ్ సదుపాయం ఉంటుందని కేంద్ర మంత్రి బదులిచ్చారు.
బెంగుళూరు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరోసైన్సెస్ సహకారంతో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, బాలల రక్షణ, మానసిక ఆరోగ్యం, మానసిక సంరక్షణ, ఇతర మానసిక సామర్థ్యాలను పెంపొందించే శిక్షణ అందిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
మిషన్ శక్తి మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఓ.ఎస్.సి వద్ద ఒక సైకో సోషల్ కౌన్సెలర్‌తో సహా 13 మంది మానవశక్తి వనరుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం 100 శాతం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, మహిళలు మరియు పిల్లల సంబంధిత పథకాల అమలు కోసం మంత్రిత్వ శాఖ ‘మిషన్ శక్తి’ మరియు ‘మిషన్ వాత్సల్య’ మార్గదర్శకాలను విడుదల చేసిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.