విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సి ఉంది
చంద్రబాబు వృద్ధాప్యంలో ఉన్నారంటూ వ్యాఖ్యలు సరికాదు
సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని జగన్‌మోహన్‌రెడ్డి
తణుకులో రాష్ట్ర మంతి టి.జి.భరత్ విమర్శలు
ఎమ్మెల్యే రాధాకృష్ణతో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి భరత్
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్ అన్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ద్వారానే ఆ ప్రాంతం తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. తణుకు మండలంలోని రూ. 1.60 కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి మంత్రి భరత్ పాల్గొన్నారు. అనంతరం వేల్పూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లిన మంత్రి భరత్ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ ఇటీవల ఒక వైసీపీ మంత్రి మాట్లాడుతూ చంద్రబాబునాయుడిని వృద్ధాప్యంలో ఉన్నారంటూ కించపర్చుతూ మాట్లాడుతున్నారని ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తామైతే జగన్‌మోహన్‌రెడ్డిని వందేళ్లు బతకాలని కోరుకుంటామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంటుందన్నారు. ఇంట్లో సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హుందాతనంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని గానీ ఇలాంటి ప్రతిపక్ష నేతను ఎక్కడా ఉండరని చెప్పారు. రాధాకృష్ణ లాంటి నాయకులను ఎన్నుకోవడం ద్వారా భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 25 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు దిశగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కృషి చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ మంత్రి భరత్ నేతృత్వంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. అంతకుముందు తణుకు మండలం వేల్పూరు నుంచి మండపాక పంచాయతీ రోడ్డుకు రూ. 1.02 కోట్లు నిధులతో శంకుస్థాపన చేశారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి మంత్రి భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి భరత్‌కు వేల్పూరు గ్రామంలో ఘనస్వాగతం లభించింది. గ్రామంలో భారీ ర్యాలీతో మంత్రి భరత్, ఎమ్మెల్యే రాధాకృష్ణను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.