మద్యం కుంభకోణంలో రూ. 3500 కోట్లు అవినీతి
భుజాలు తడుముకుంటున్న వైసీపీ నాయకులు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘాటు విమర్శలు
మద్యం కుంభకోణంలో జగన్మోహన్రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగిందన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలోని 7, 8 వార్డుల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికీ పర్యటించి గత ఏడాదిగా అందుతున్న సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎంపీ మిధున్‌రెడ్డిని జైలులో పెడితే వైఎస్సార్సీపీ నాయకులు భుజాలు తడుముకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్రెడ్డి మాట తప్పినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారా…? లేక మద్యం అడ్డం పెట్టుకుని రూ. 3500 కోట్లు కుంభకోణం చేసినందుకు నిరసన చేస్తున్నారా..? అనేది ఆలోచించుకోవాలన్నారు. త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ కూడా సిట్ ద్వారా అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నట్లుగా కక్షసాధింపు చర్యలు లేవన్నారు. కుంభకోణాలు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారని విమర్శించారు . వైసీపీ నాయకులు చేసిన పాపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్రెడ్డి అమలు కాని ఎన్నో హామీలు ఇచ్చి తుంగలో తొక్కారని అరకొర సంక్షేమాన్ని అమలు చేశారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ద్వారా డబ్బులు తీసుకుని దోచుకున్నారని అన్నారు. మద్యాన్ని అడ్డం పెట్టుకుని రూ. 3500 కోట్లు దుర్వినియోగం చేసినట్లు సిట్ ధృవీరకరించిందన్నారు. మద్యం కుంభకోణంలో ఉన్న వైసీపీ నాయకులతోపాటు జగన్మోహన్రెడ్డి సైతం భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.