విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్)
జ్ఞానాపురం పునీత పేతురు క్యాథెడ్రల్ చర్చ్ లో 125 సంవత్సరాల దేవ మాత మోక్షరోపణ మహోత్సవాల 9 దినాల ప్రార్ధనలు ‘నొవీనా’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఉత్సవాల నవదిన ప్రార్థనల చరిత్ర ను విచారణ కర్తలు రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ వివరించారు. ఈరోజు మొదటి రోజు బుధవారం ప్రార్థనల్లో ఖమ్మం డయోసిస్ కు చెందిన రెవరెండ్ ఫాదర్ సూరేపల్లి ఐజక్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉత్సవాల పతాకం (జెండా)ను ఆవిష్కరించి, దివ్యబలి పూజ నిర్వహించారు. పరిశుద్ధ బైబిల్ గ్రంధంలో ‘మరియమాత’ కు ఉన్న ప్రాముఖ్యతను వాక్యానుసారం ఉదాహరణలతో వివరించారు. జూబ్లీ ఉత్సవాల చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. బెలూన్లు తో తయారు చేసిన భారీ జపమాలను ఫాదర్లు గాలిలో ఎగరవేశారు. తదుపరి ‘దేవమాత తేరు’ ప్రదక్షిణ – రొసిలియన్, సిలువ గుర్తు వీధుల్లో ఘనంగా జరిగింది. శ్రీముసురు రాజేష్ బాబు ఆధ్వర్యంలోని పిపిసి కమిటీ, భక్త సంఘాల సభ్యులు, వందలాది మంది క్రైస్తవులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.