కమ్యూనిటీ పారామెడిక్స్&ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ అసోసియేషన్) తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఆధ్వర్యంలో మంగళవారం ఉండ్రాజవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద గౌడ కమ్యూనిటీ హాల్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సు కు మండల అధ్యక్షులు టేకి వీరభద్రం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమండ్రి కి చెందిన డెల్టా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎమ్ ఫణీంద్ర హాజరై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పై అవగాహన పొంది ఉండాలని,ఈ క్యాన్సర్ ను తొలి దశలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని అన్నారు.హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి జీవనశైలిలో వచ్చిన మార్పులు క్యాన్సర్ కు కారణమవుతుందని,మద్యపానం, ధూమపానం, ప్లాస్టిక్ వాడకం కు దూరంగా ఉండాలని అన్నారు. అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లు ఇంటి ఇంటికి వెళ్లి క్యాన్సర్ వ్యాధి ని నిర్ధారించుటకు సార్వత్రిక క్యాన్సర్ పరీక్ష కార్యక్రమం చేపట్టారని ఈ పరీక్ష కార్యక్రమంలో భాగంగా నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలని చేయడం జరుగుతుందని 18ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని,ఉండ్రాజవరం మండల శాఖ కార్యదర్శి జె సుధాకరరావు,సిద్దూ,ఎమ్ ముత్తయ్య, ప్రేమ్ కుమార్, జిన్నా, బి నాగేశ్వరరావు,కిరణ్, హాస్పిటల్ డీజీఎమ్ గుమ్మళ్ళ శివ ప్రసాద్,పీఎంపీ సభ్యులు పాల్గొన్నారు.