కూటమి నేతలకు రాష్ట్ర కార్యవర్గం ద్వారా వినతులు
వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గంట్ల
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో జర్నలిస్టుల సంక్షేమ పధకాలకు తగు ప్రాధాన్యం కల్పించే విధంగా నిధులు కేటాయించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఏపీ ఎన్జీవో హోంలో మంగళవారం నిర్వహించిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమము ముగింపులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయించే విధంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం గతంలోనే ఇందుకు సంబంధించి హామీలు ఇవ్వడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు పై పొందు పరిచిందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ లకు తమ రాష్ట్ర కార్యవర్గం ద్వారా వినతులు అందజేశామన్నారు. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీను బాబు కోరారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షులు పి.నారాయణ, కార్యదర్శి జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ గత నెల 20 నుంచి నేటి వరకు సుమారు 600 మంది వర్కింగ్ జర్నలిస్టులు తమ యూనియన్ లో సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నట్లు చెప్పారు. త్వరలోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయనున్నట్లు వీరు వివరించారు. రాష్ట్రకార్యవర్గం ద్వారా లేబర్ ఆఫీస్, ఇతర విభాగాలకు యూనియన్ సభ్యులు జాబితా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవలేశ్వరం రవికుమార్, బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి కె.మదన్, ఉపాధ్యక్షులు పి. నగేష్ బాబు, కార్య వర్గ సభ్యులు బొబ్బర ప్రసాద్, గోపినాథ్ తో పాటు పెద్దఎత్తున జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.