ఆమెను సస్పెండ్ చేయాలి – రౌండ్ టేబుల్ సమావేశంలో జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్
లీడర్ దినపత్రికకు చట్ట వ్యతిరేకంగా విశాఖపట్నం ఆర్ డి ఓ శ్రీలేఖ జారీ చేసిన వారంట్ ను తక్షణమే రద్దు చేయాలని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ వారంట్ ను రద్దు చేయడంతో పాటు ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆమెకు లేని అధికారాన్ని మీడియాపై చెలాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. లీడర్ దినపత్రికలో ప్రచురించిన కథనాలపై జారీ చేసిన వారంట్ లో ప్రజల శాంతికి భగ్నం కలిగించారని, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని సి ఆర్ పి సి సెక్షన్ 505 కింద రెండేళ్లకు పైగా జైలు శిక్ష తో పాటు జరినామా కూడా విధించే కేసులు నమోదు చేస్తామని బెదరింపులకు పాల్పడ్డారని తెలిపారు. నిజానికి ఆ చట్టం ఉనికిలో లేదని, దాని స్థానంలో బి ఎన్ ఎస్ ఎస్ ఉందనే విషయం ఆర్ .డి. ఓ.కు తెలియక పోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పత్రికను ఎందుకు మూసి వేయించరాదని,అక్రిడేషన్లు రద్దు చేస్తామంటూ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పాడారన్నారు. పత్రికను రిజిస్ట్రేషన్ చేసే అధికారం వాటిపై చర్యలు తీసుకు అధికారం కేవలం ప్రెస్ రిజిష్ట్రార్ ఆఫ్ ఇండియా (పిఆర్ జిఐ) కు మాత్రమే ఉందని ప్రెస్ అ క్రి టేషన్ల నిలిపే అధికారం కూడా జిల్లా మీడియా కమిటీలకు తప్ప ఎవరికీ లేదని స్పష్టం చేశారు. మీడియాపై ఈ రకమైన జులుం ప్రదర్శించడం పూర్తిగా పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. లీడర్ ప్రచురించిన కథనాలపై అభ్యంతరాలు ఉంటే ఖండన విడుదల చేయవచ్చని లేదంటే ప్రెస్ మీట్ పెట్టి అభ్యంతరాలు చెప్పొచ్చని పేర్కొన్నారు. దీన్ని విస్మరించి ప్రభుత్వానికి మీడియాకు మధ్య దూరం పెంచే విధంగా ఇలాంటి చర్యలు తగవని పేర్కొన్నారు .ముదపాక కుంభకోణంలో దళితులు,బీసీ,పేదలకు న్యాయం చేయాలని లీడర్ పత్రిక వార్తలు రాస్తే దాన్ని ప్రక్క దారి పట్టించే విధంగా ఈ చర్యలు ఏంటని ప్రశ్నించారు. ముదపాక సమస్య ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి తోపాటు నారా లోకేష్ దృష్టిలో కూడా ఉందని సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని వారిచ్చిన ఆదేశాలను కూడా ఆర్ డివో తప్పుడు నివేదికలతో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి సత్యనారాయణ, జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి, ఐడిజెఎం రాష్ట్ర అధ్యక్షుడు టి.నానాజీ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె రాము, ఉపాధ్యక్షుడు కె.చంద్రమోహన్, తెలుగు జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఈశ్వర్ చౌదరి, జార్జి, జాప్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు,కె. ఎం.కీర్తన్, ఏపీజేయూ ప్రతినిధి బాలభాను, ఏపీఎంఎఫ్ నాయకులు, కిరణ్ కుమార్, లత, ఏపీయూడబ్ల్యూజే గాజువాక యూనిట్ అధ్యక్షుడు కె.పరశురాం, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చందు యాదవ్, స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, సత్యనారాయణ అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల్ కుమార్, ఐజేయు ప్రతినిధి హరనాథ్, జర్నలిస్టులు ఎం.శ్రీనివాసరావు, సూర్యం, వాల్మీకి నాగరాజు, వాసుదేవరావు, కాండ్రేగుల వెంకటరమణ, బి.నారాయణరావు, శివకుమార్ రెడ్డి, బండి శివ, ఎస్.సన్యాసిరావు, ఎం. శ్రీహరి, పృథ్వీరాజ్, భాస్కర్, ఏపీ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొని మాట్లాడారు.