ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలపడం దురదృష్టకరమని రాజోలు మండల మాలల న్యాయపోరాట సమితి జేఏసీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండల తాసీల్ధార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఎస్సీ వర్గీకరణకు క్యాబినేట్ ఆమోదం తెలపడంపై క్యాబినేట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 వ సంవత్సర జనాభా లెక్కలను తీసుకుని ప్రత్యేక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు క్యాబినేట్ ఆమోదం తెలపడం క్యాబినేట్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. తాజాగా సమగ్ర కులగణన చేపట్టి ఎస్సీ సామాజిక వర్గంలో ఏ ఉపకులం ఎంతుందో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం చేసే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని మాలల న్యాయపోరాట సమితి జేఏసీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన మెమోరాండంను తాసీల్ధార్ కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జేఏసీల ముఖ్య సలహాదారు బత్తుల మురళీకృష్ణ, మండల జేఏసీ అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి లిఖితపూడి బుజ్జి, ఉపాధ్యక్షులు మందపాటి మధు, జిల్లెళ్ళ వినోద్ బాబు, చిలకపాటి శ్రీధర్, విప్పర్తి సాయిబాబు, గొల్లమందల నాగేంద్ర కుమార్, గోగి రవింద్ర, బొడ్డపల్లి పుల్లయ్య, చింతా శ్రీనివాస్, మెడబల శ్యాం శేఖర్, నీతిపూడి సత్యనారాయణ, రాపాక నరసింహం, రాపాక విరాట్ తదితరులు పాల్గొన్నారు.
