ప్రారంభమైన రహదారి అభివృద్ధి పనులు.
- రూ.34.50 కోట్లతో 37 కిలోమీటర్లు బీటీ రోడ్డుగా రూపాంతరం.
- ఐదేళ్ల అగచాట్ల నుంచి ప్రజలకు విముక్తి.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలించడంతో కుక్కునూరు- భద్రాచలం ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు వేలేరు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవునా ప్రధాన రహదారి రాళ్లు లేచి మోకాళ్ళ లోతు గుంతలుపడి ప్రజలకు ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకం చూపించింది. వాహన చోదకులు గుంతల వల్ల తరచూ ప్రమాదాల బారిన పడ్డారు. కొందరైతే ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి భయపడి రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి రహదారిని అభివృద్ధి చేసేందుకు సంకల్పించిన ప్రభుత్వం రూ.34.50 కోట్లు మంజూరు చేసింది. సాంకేతిక కారణాల వల్ల ఏడు నెలల పాటు రహదారి అభివృద్ధి పనులు నిలిచాయి. ఈ రహదారి సమస్యను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి కుక్కునూరు మండలానికి చెందిన నాయకులు, ప్రజలు తీసుకువచ్చారు. గుంతలు పడిన రహదారిలో తాము పడుతున్న ఇబ్బందులను ఎంపీ మహేష్ కుమార్ కు వివరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, రహదారి అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాంకేతిక సమస్య అధిగమించేలా ఎంపీ మహేష్ కుమార్ తన వంతు కృషి చేశారు. దీంతో రహదారి అభివృద్ధి పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించారు. గుంతలు పడి అధ్వానంగా ఉన్న రహదారిని తవ్వేసి, వెట్ మిక్స్ మెక్ డం పరచగా ప్రస్తుతం బీటీ వేసే పనులు ముమ్మురంగా జరుగుతున్నాయి. మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆర్.అండ్.బి డీఈ హరికృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ మహేష్ కుమార్ చేసిన కృషి ఫలితంగా రహదారి అభివృద్ధి పనులు చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి విముక్తి లభించింది.