ఇందుకోసం 2026 జనాభా లెక్కల సేకరణ వరకు వేచి చూడాల్సిందేనని తెలిపింది. ఇది చిన్న విషయం కాదని, పెద్దఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లోని సెక్షన్ 26 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి 2022 జూన్7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్తగా ఏర్పడిన ఈ రెండు రాష్ట్రాలను మినహాయించి… కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీరు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను మాత్రమే పునర్విభజించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ వ్యాజ్యం బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది రావు రంజిత్ వాదనలు వినిపించారు, డీలిమిటేషన్ కమిషన్ నోటిఫికేషన్లలో రాష్ట్రాలను చేర్చడం, మినహాయించడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యతని ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో పేర్కొందని గుర్తు చేశారు. ఈ విషయంలో ఇప్పటికీ కేంద్రం తన సమాధానం చెప్పలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తరపు అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ స్పందిస్తూ.. డీలిమిటేషన్ ప్రక్రియ కోసం 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పిటిషనర్ పదేపదే ప్రస్తావిస్తున్న జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంతమని గుర్తు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం కాబట్టే అక్కడ డీలిమిటేషన్ సాధ్యమైందని.. దానితో ఏపీ, తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఈ వాదనపై రావు రంజిత్ అభ్యంతరం తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీరు హోదా మారిందని తెలిపారు. ఆయన వాదనలపై జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీరు గురించి ప్రస్తావించవద్దని సూచించారు. రంజిత్ తన వాదనలు కొనసాగిస్తూ.. డీలిమిటేషన్ విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. కేంద్రం చెబుతున్నట్లు 2026 తర్వాత కూడా దక్షిణాదిన ఈ ప్రక్రియ చేపట్టే పరిస్థితి కనిపించడంలేదని తెలిపారు. జమ్మూకశ్మీరు కంటే ఐదేళ్ల ముందు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను డీలిమిటేషన్ అంశంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.
