ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులే

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

పేదరికం లేని సమాజం కోసమే పీ4 విధానం.. పీ4లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు

నిడదవోలు: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుండి అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులేనని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ లో పీ4పై సమీక్షించిన మంత్రి కందుల దుర్గేష్ పలు అంశాలపై మాట్లాడారు.సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. మహిళలు నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ తదితర 5 కేటగిరి బస్సుల్లో ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచితంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అదే విధంగా రూ.4 వేలకు పెన్షన్ల పెంపు చేపట్టడం కూటమి ప్రభుత్వ సాహసోపేత నిర్ణయంగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు.

బంగారు కుటుంబాలు భవిష్యత్ లో మార్గదర్శులుగా మారాలి:మంత్రి కందుల దుర్గేష్

సమాజం బాగుండాలన్న సత్సంకల్పంతో పేదరికం లేని సమాజం కోసమే సీఎం చంద్రబాబునాయుడు పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్) విధానం తీసుకొచ్చారని, ఇందులో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. పీ4 అమలు ద్వారా భవిష్యత్ లో సమాజంలో మంచి మార్పు వస్తుందని మంత్రి దుర్గేష్ ఘంటాపథంగా వెల్లడించారు. ఈ క్రమంలో బంగారు కుటుంబాలను,మార్గదర్శులను అనుసంధానం చేసేలా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. బంగారు కుటుంబాలకు కావలసిన అవసరాలను గుర్తించడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 7862 బంగారు కుటుంబాలను, 19901 మంది బంగారు కుటుంబంలో వ్యక్తులను, 685 మంది మార్గదర్శులను గుర్తించడం జరిగిందన్నారు. వారు ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవడం కోసం అనుసంధానం చేస్తున్నామన్నారు.
భవిష్యత్ లో బంగారు కుటుంబాలు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. కేవలం డబ్బుకన్న వాళ్లే మార్గదర్శులుగా ఉండాలన్న నిబంధనేమీ లేదని, నైపుణ్యాలను పంచుకోవడం ద్వారా, తమకు తోచిన సాయం చేయడం ద్వారా కూడా మార్గదర్శులుగా మారవచ్చన్నారు. కేవలం వ్యాపారస్థులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారన్న విషయం గుర్తుచేశారు. ఇటీవల సీఎం కొవ్వూరు నియోజకవర్గం వచ్చిన సమయంలో జరిగిన ఆసక్తికర ఘటనను వివరించారు. బంగారు కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి ఒక మార్గదర్శి వల్ల బాగా చదువుకోగలుగుతున్నానని, భవిష్యత్ లో తాను మార్గదర్శిగా మారతానన్న విషయం ఈ సందర్భంగా ఉదహరించారు. ఆ అమ్మాయి భవిష్యత్ లో పది మందికి సాయం చేసే స్థాయికి ఎదగుతానన్న స్ఫూర్తిదాయకమైన మాటలను మంత్రి గుర్తుచేశారు. బంగారు కుటుంబాలు భవిష్యత్ లో మార్గదర్శులుగా మారాలని మంత్రి దుర్గేష్ సూచించారు. అంతేగాక పేదల కళ్లలో ఆనందం నింపేందుకు ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో భాగం పంచుకోవాలన్నారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 17 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరించి సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకొని విధంగా ఒక స్వయం నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యవస్థను నిర్మించడానికి కార్యక్రమం ఉపకరిస్తుందని భావిస్తున్నామన్నారు.మార్పు కోసం ముందడుగు వేసే నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ షేక్ వజీరుద్ధీన్, కౌన్సిలర్లు నిడదవోలు నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె. సతీష్, పెరవలి మండల ప్రత్యేక అదికారి ఎం.సునీల్ వినయ్, నిడదవోలు మండల ఎంపీడీవో వీఎస్ వీఎల్ జగన్నాధ రావు, మున్సిపల్ కమిషనర్ తోట శ్రీకృష్ణవేణి, నిడదవోలు మండల తహశీల్దార్ బి.నాగరాజు నాయక్, ఉండ్రాజవరం మండల ఎంపీడీవో వీ.వీ.వీ.ఎస్ రామారావు, ఉండ్రాజవరం మండల తహశీల్దార్ పీఎన్ డీ ప్రసాద్, పెరవలి మండల ఎంపీడీవో గంటా శ్రీనివాసు,పెరవలి మండల తహశీల్దార్ కె.నిరంజన్, నిడదవోలు మండల జనసేన పార్టీ అద్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, ఉండ్రాజవరం మండల బీజేపీ పార్టీ అద్యక్షులు కె.సత్యనారాయణ (బాలాజి), నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link