నిడదవోలులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ర్యాలీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్..స్వయంగా ద్విచక్రవాహనానికి జెండా కట్టుకొని బైక్ ను నడిపిన మంత్రి

భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని మంత్రి దుర్గేష్ పిలుపు

నిడదవోలు: భారత జాతి ఘనతను, సమాజ స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తూ నిడదవోలు పట్టణంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతా కీ జై, హర్ ఘర్ తిరంగ, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భారీ ఎత్తున స్థానిక నాయకులు, యువత పాల్గొన్నారు. అనంతరం ప్రధాని పిలుపు మేరకు స్వాతంత్య్ర, ఐక్యతా స్ఫూర్తికి సంబంధించి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ బైక్ ర్యాలీని సైతం నిర్వహించారు. భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని స్వయంగా బైక్ ను నడిపి ప్రచారం నిర్వహించారు. ప్రతి పౌరుడిలో దేశం పట్ల ప్రేమ, గౌరవం, దేశభక్తి భావనలను పెంపొందించాలన్నదే తమ లక్ష్యమన్నారు.జాతీయ జెండాతో మనకున్న సంబంధాన్ని కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయకుండా, దానిని వ్యక్తిగతమైన, హృదయ పూర్వకమైన అనుబంధంగా మార్చుకోవాలన్నారు.త్రివర్ణ పతాకాన్ని మనం ఎందుకు ఎగురవేసుకుంటున్నామో దాన్ని సాధించడానికి అంటే ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించడానికి ఎంత మంది త్యాగధనులైన అమరవీరులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమారో ఆ వీరులను ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ తెలుసుకోవాలన్నారు. అటువంటి దేశభక్తి కలిగి ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.దేశ కీర్తి ప్రతిష్టలు, శక్తి సామర్థ్యాలకు ఇది ప్రతీక అని మంత్రి దుర్గేష్ తెలిపారు.

Scroll to Top
Share via
Copy link