తాడిపర్రు నుండి వెలగదుర్రు వరకు ట్రాక్టర్లతో నిర్వహించిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా ర్యాలీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసిన రైతన్నలు, కార్యకర్తలు, నేతలు
భారీ వర్షంలో సైతం కొనసాగిన ర్యాలీ..ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేసిన మంత్రి కందుల దుర్గేష్
రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఇది రైతుల బాగు కోరే మంచి ప్రభుత్వమని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ ను సాధిద్దామని, సీఎం, డిప్యూటీ సీఎంలకు చేయూతనందించాలని మంత్రి దుర్గేష్ పిలుపు
నిడదవోలు: సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన అమలు చేశామని తద్వారా రైతన్నల ఖాతాల్లో రూ.20వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని జమ చేశామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బుధవారం నిడదవోలు నియోజకవర్గంలోని తాడిపర్రు నుండి వెలగదుర్రు వరకు ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ఆకుపచ్చ కండువా వేసుకొని కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్ ను నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేసిన దానికి కృతజ్ఞతగా భారీ వర్షంలో సైతం ర్యాలీ చేపట్టామన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో తమకు ఆర్థిక సహకారం అందించిన సీఎం,డిప్యూటీ సీఎంలు సుఖంగా ఉండాలని రైతన్నలు నినదించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఇది రైతుల బాగు కోరే మంచి ప్రభుత్వమని పేర్కొంటూ అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన ద్వారా సన్న, చిన్నకారు, కౌలు అన్ని కేటగిరీల రైతులకు మొత్తం మూడు విడతల్లో రైతన్నల ఖాతాల్లో రూ.20000 లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.అందులో భాగంగా తొలివిడతగా కేంద్రం 2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు, రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.5వేలు, కేంద్రం రూ.2 వేలు, మూడో విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు, కేంద్రం రూ.2 వేలు మొత్తంగా ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన క్రింద అర్హులైన ప్రతి రైతన్నకు రూ.20,000 సాయం అందించనున్నాయని పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14,000, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.6000 ఉంటుందన్నారు. ఇప్పటికే తొలి విడతగా రాష్ట్ర వాటాగా రూ.5000, కేంద్రవాటాగా రూ.2000 మొత్తం రూ.7000 రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. గత ప్రభుత్వం రైతులకు కులం ఆపాదించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రైతును రైతుగానే చూస్తున్నామన్నారు.గత ప్రభుత్వంలో కొన్ని కులాలకు మాత్రమే లబ్ధి చేకూర్చకుండా ప్రతి రైతుకు తాము మేలు చేకూర్చామన్నారు. అన్నదాతలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ క్రమంలో కౌలు రైతుకు ప్రత్యేక కార్డు, యజమానికి మరో కార్డు అందించామన్నారు. రైతులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని, ఇది ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
పంటల సాగుకు ఆర్థిక తోడ్పాటు కోసం అన్నదాత సుఖీభవ నగదు జమ చేయడంతో రైతులు,కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ ను సాధిద్దాం: మంత్రి కందుల దుర్గేష్
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమృతహస్తాల మీదుగా ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభిస్తున్నామన్నారు. బటన్ నొక్కే కార్యక్రమాలలా కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సంక్షేమం అందించడంతో పాటు సంపూర్ణ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు పూర్తి చేయూతనందించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఇతర నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.