సకాలంలో పనులు పూర్తి చేయాలని, రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు ఆదేశం
వీలైనంత త్వరగా ప్రజలకు రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని సూచన
త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో నూతన రోడ్లు వేస్తామని వెల్లడి
నియోజకవర్గంలో పుంత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపడామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.బుధవారం ఉండ్రాజవరం మండలం తీపర్రు వంతెన నుండి తాడిపర్రు శివారు వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర తీపర్రు నుండి వడ్లూరు వెళ్లే దాదాపు 9.6 కి.మీల ఆర్ అండ్ బీరోడ్డుకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాబార్డు సాయంతో రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ క్రింద రూ.24 లక్షల వ్యయంతో 4 గ్రామాలకు అనుసంధానం చేసే వడ్లూరు- తీపర్రు ఆర్ అండ్ బీ రహదారికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. తద్వారా ఆయా గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్ అండ్ రోడ్ల వేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వానికి సైతం ప్రతిపాదనలు పెట్టామన్నారు.
ఇప్పటికే కానూరు దగ్గర సిమెంట్ రోడ్డు మంజూరైందని మంత్రి దుర్గేష్ తెలిపారు. త్వరలోనే రూ.20 కోట్ల ఎన్ ఆర్ ఈజీఎస్ నిధులతో నిడదవోలు నియోజకవర్గంలో మరిన్ని రోడ్లను వేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అంతేగాక రూ.5 కోట్లతో ఎంపీ ఫండ్స్ నుండి నిధులు తీసుకువచ్చి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు మంత్రి దుర్గేష్ సూచించారు. సకాలంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
గత ప్రభుత్వం కొత్త రోడ్లు నిర్మించకపోగా, ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేసేందుకు తట్టెడు మట్టి కూడా వేయలేదని మంత్రి దుర్గేష్ ఆగ్రహించారు. గత ఐదేళ్లలో నరకానికి చిరునామాగా మారిన రహదారులు ప్రజలు చూశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం దిగ్విజయంగా చేపట్టామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నాబార్డు నిధుల సాయంతో అన్ని గ్రామాల్లో రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని పుంత రోడ్లను సైతం నిర్మిస్తామన్నారు. డ్రెయిన్ల నిర్మాణం చేపడతామన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి రోడ్లు, డ్రెయిన్ల అంశంపై చర్చిస్తామన్నారు. ఇంకా చాలా రోడ్లు బాగు చేయించాల్సిన అవసరముందని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. గత పాలకుల పాపం వెంటాడుతుండటం వల్ల కొన్ని అంశాల్లో ఆలస్యం జరుగుతుందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
శంకుస్థాపన కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.