విద్యార్థుల భవితను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం చాలా అత్యవసరమని, తల్లిదండ్రుల సహకారం లోపిస్తే పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడం కష్టమని ప్రతి ఒక్క తల్లితండ్రులు బాధ్యతలు మెలుగుతూ ఉపాధ్యాయులకు సహకారం అందించాలని ఎంవి ఎన్. జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కే.ఎస్కే. మాణిక్యాలరావు తెలిపారు. మల్లినవెంకట నరసమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండ్రాజవరం నందు శనివారం ఉదయం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఉదయం నుండి పాఠశాల ప్రాంగణం అంతా పండగ వాతావరణంతో నెలకొంది. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే ఎస్ కే మాణిక్యాలరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ, పాఠశాల గత ఐదు సంవత్సరాలు విద్యార్థులు సాధిస్తున్న విజయాలకు సంబంధించిన వివరాలు, గ్రామస్తుల, పలు కార్పొరేట్ కంపెనీల యొక్క ఆర్థిక సహకారంతో ఇటీవల పాఠశాలకు సమకూర్చినటువంటి మౌలిక సదుపాయాల వివరాలను, ప్రభుత్వం అందించినటువంటి అనేక ఆధునిక సాంకేతిక పరికరాల యొక్క వివరాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా విద్యాకమిటీ చైర్మన్ పెదగాడి రాము మాట్లాడుతూ పాఠశాలలో చక్కటి వాతావరణ నెలకొని ఉందని, పిల్లల పట్ల అతిగారం లేకుండా ఉపాధ్యాయులు చెప్పినట్లుగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఉండ్రాజవరం ఉన్నత పాఠశాలకు, దాతలకు కొదవలేదని ఒక మంచి ఆలోచన, అవసరంతో దాతలను సంప్రదిస్తే అనేక గొప్పసౌకర్యాలు ఏర్పాటుచేసుకోగలమని పలువురు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల కు సంబంధించిన పలు అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు తల్లిదండ్రులను, గ్రామస్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు ముగ్గురు పోటీలను, ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా తల్లిదండ్రులు చిన్నపిల్లలగా మారి, పాఠశాలలో ఆనందంగా కార్యక్రమంలో పాల్గొనడం పాటు, విద్యార్థులతో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలసి భోజనం చేయడం ఎంతో ఆనందదాయకమని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫలితం నెరవేరిందని మండల ఎంఈఓ శ్రీమతి శారదాజ్యోత్స్నా తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు, ఉదయ భాస్కర్, ఐ. రాంబాబు, లక్ష్మీనారాయణ, నీలవేణి, పద్మావతి, సుబ్బారావు, మహేష్ తదితరులు, పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ కంటిపూడి దుర్గాభవాని, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు… ఈ కార్యక్రమానికి, నిర్వాహకులుగా వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్ స్వామి, పుష్పవల్లి, కార్యక్రమ సమన్వయకర్తగా సీనియర్ ఉపాధ్యాయులు చెరుకూరి దుర్గాప్రసాద్, బి. శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.
