గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం చేసిన రాష్ట్ర ప్రజలు ఓడించినప్పటికీ బుద్ధి రాకుండా వైసీపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఇంట్లోంచి బయటకు ఈడ్చి తన్నుతామని, నరికి చంపేస్తామని మాట్లాడిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావులు వెనుక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం అర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ తణుకు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. భవిష్యత్తులో రోడ్లు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ముఖ్యంగా రోడ్లు అభివృద్ధికి నిధుల మంజూరులో ఇబ్బందులు తలెత్తినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకశ్రద్ధ తీసుకుని నిధులు విడుదల చేస్తున్నారని చెప్పారు. ప్రధానంగా నియోజకవర్గంలో స్మశాన వాటికల అభివృద్ధితోపాటు రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, తణుకు ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
