తిరంగా జెండాలతో మార్మోగిన తణుకు – ‘ఆపరేషన్‌ సింధూర్‌’ విజయం పట్ల కృతజ్ఞతాభావంతో యాత్ర

ఆకట్టుకున్న 400 అడుగుల భారీ జాతీయ జెండా

మున్సిపల్‌ కార్యాలయం నుంచి వెంకటేశ్వర థియేటర్‌ వరకు యాత్ర

ఆధ్వర్యం వహించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

జై భారత్‌… జై జవాన్‌… నినాదాలతో మార్మోగిన తణుకు

ఆపరేషన్‌ సింధూర్‌ విజయాన్ని పురస్కరించుకొని, భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా తణుకులో ఆదివారం నిర్వహించిన తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తి రగిలించింది. జాతీయ జెండాలతోపాటు సుమారు 400 అడుగుల పొడవు కలిగిన జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని తణుకులో నిర్వహించిన తిరంగా యాత్రకు విశేష స్పందన లభించింది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్ర మున్సిపల్‌ కార్యాలయం నుంచి రాష్ట్రపతిరోడ్డు మీదుగా వెంకటేశ్వర థియేటర్‌ సెంటర్‌ వరకు సాగింది. భారత్‌ మాతాకీ జై… జై జవాన్‌… జై భారత్‌… వందేమాతరం… అంటూ చేసిన నినాదాలతో తణుకు పట్టణ మార్మోగిపోయింది. పట్టణంలోని ప్రధాన రోడ్లు వెంబడి జాతీయ జెండా చేతపట్టుకుని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, వైద్యులు, విద్యార్థులు, యువత మధ్య నడుచుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజల్లో జాతీయ స్పూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిటైర్డ్‌ మిలటరీ జవాన్లను ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ భారత్‌పై ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ఉగ్రమూకలను మట్టి కరిపించే విధంగా చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతం అయ్యిందన్నారు. పహల్గాం దాడుల్లో 26 మందికి హతమార్చిన ఉగ్రవాదుల దుశ్చర్యల వెనుక పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలను తుడిచిపెట్టేందుకు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా హర్షం తెలియజేసిందని చెప్పారు. దేశ ఆడపడుచుల సింధూరాన్ని తెంచిన ఉగ్రవాదుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన ఆపరేషన్‌ సింధూర్‌లో త్రివిధ దళాల సైన్యానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఉగ్రవాద సంస్థలను గుర్తించి వారి స్థావరాలను లక్ష్యంగా చేసకుని భారత్‌ సైన్యం చూపించిన తెగువ ప్రపంచానికి చాటిచెప్పగలిగామని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అనేక దేశాలు తక్కువగా అంచనా వేశాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చొరవతో సైనిక బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. దేశభద్రతకు, దేశ రక్షణకు ఎలాంటి ముప్పు కలిగించాలని చూసే ఉగ్రవాద సంస్థలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో భారత్‌ ఒక శక్తిగా ఎదిగిందని ప్రపంచం తెలుసుకుందన్నారు. పాకిస్తాన్‌ను కాళ్లబేరానికి తీసుకువచ్చిన వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. వీరోచితంగా పోరాటం చేసిన దేశ సైనికులకు దేశంలోని 144 కోట్లు ప్రజలు, నరేంద్రమోదీ అండ ఉంటుందని ప్రపంచ దేశాలకు చాటిచెప్పగలిగామన్నారు. పాకిస్తాన్‌తో చేసిన దాడిలో మురళీ నాయక్‌ వీరమరణం పొందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వాలు ఎప్పుడూ అండగా ఉంటాయన్నారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని, కుట్రలకు ప్రయత్నించే దేశాలకు మన బలం నరేద్రమోదీ చెబుతున్న సమాధానమే అన్నారు. తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన వ్యాపారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలతోపాటు యువత, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link