: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య 115వ జయంతి పురస్కరించుకొని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి కందుల దుర్గేష్
తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం రేలంగి వెంకట్రామయ్య అని తెలిపిన మంత్రి దుర్గేష్
తనదైన నట వైదుష్యంతో ప్రేక్షకులను నవ్వించిన రేలంగి చిరస్మరణీయుడని కీర్తించిన మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం: తెలుగు సినిమా హాస్యానికి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య మకుటం లేని మహారాజు అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కీ.శే. రేలంగి వెంకట్రామయ్య 115వ జయంతి పురస్కరించుకొని బుధవారం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద కందుల దుర్గేష్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం, వెండితెరపై నవ్వుల రేడు రేలంగి అని ఆయన ప్రస్థానాన్ని మంత్రి దుర్గేష్ మననం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు చిత్రసీమ నవ్వుల వనంలో వాడని పువ్వు హాస్యనట సామ్రాట్ రేలంగి అని కొనియాడారు. తన ఆకారంతోను, ఆహార్యంతోను ఆడియన్స్ ను హాస్యపు ఊయలలు ఊగించిన నవ్వుల రేడు ఆయన అని పేర్కొన్నారు. ఒకే షాట్‌లో ముఖంలోని భావాలు మార్చి ప్రదర్శించడం, అందుకు అనుగుణంగా డైలాగ్‌లను టైమింగ్‌లో పలికి హాస్యం పండించడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటు వందలాది చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి వెండితెరను ఏలిన హాస్యపురాజు రేలంగి అని కీర్తించారు. దశాబ్ధాల తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలు, విరామమెరుగని విజయాలు రేలంగి ఖాతాలో కనిపిస్తాయని, ఒక్క మాటలో చెప్పాలంటే రేయింబవళ్లు చెప్పుకున్నా తరగని చరిత్ర రేలంగిదని మంత్రి దుర్గేష్ అన్నారు. తెలుగు సినిమా హాస్య కుటుంబ వంశవృక్షాన్ని వివరిస్తే మొదటి స్థానం రేలంగిదేనన్నారు. తనదైన నట వైదుష్యంతో ప్రేక్షకులను నవ్వించిన రేలంగి చిరస్మరణీయుడని మంత్రి దుర్గేష్ అన్నారు.