రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా సంపద వికేంద్రీకరణ తో సంక్షేమాన్ని విస్తృతపరిచే శ్రేయోరాజ్య సాధనకు తగిన ప్రజా ఉద్యమానికి సన్నాహాలు చెయ్యాలని తణుకు ప్రజాసంఘాల సభ పిలుపు ఇచ్చింది. స్థానిక సురాజ్య భవనంలో
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ సభకు అధ్యక్షత వహించిన డివివియస్ వర్మ ప్రసంగిస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా పాలన సాగించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేని విమర్శించారు.ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడవలసిన జాతి భౌతికసంపద ప్రయివేటు వ్యక్తుల పరం చేయడం, అలాగే ప్రభుత్వ విధానాలతో సంపద కొద్దిమంది దగ్గర పోగు పడకూడదన్న ఆదేశానికి భిన్నంగా సంపద పోగు పడడం , మద్యనిషేధానికి దారులు వెయ్యాలని సూచిస్తే ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయమార్గం చేసుకోవడం రాజ్యాంగ ఆదేశాలకు విరుద్ధం అని ఆయన స్పష్టంచేశారు. రాజ్యాంగ పీఠిక ప్రకటించిన సామాజిక ఆర్ధిక న్యాయం అందరికీ కల్పించడానికి పోగుపడ్డ సంపదను వికేంద్రీకరించే నినాదంతో ప్రజాసంఘాలు ఉద్యమించాలన్నారు. రాబోయే జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవాన్ని ఈ నినాదంతో నిర్వహించాలని పిలుపు ఇచ్చారు.
సభా ప్రారంభం లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు మాట్లాడుతూ శ్రమజీవులంతా సంపద పునఃపంపిణీ నినాదంతో ఐక్యంగా ఉద్యమించాలని ప్రకటించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పి వి ప్రతాప్ మాట్లాడుతూ పాలక పక్షాలు రెచ్చగొడుతున్న మత విద్వేషాన్ని ప్రతిఘటిస్తూ ఐక్యంగా ప్రజా ఉద్యమం సాగించాలన్నారు. సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపకులు పేరూరి మురళీ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం దోపిడీ వివక్ష లేని సమాజాన్ని కాంక్షించిందని ప్రజాచైతన్యం తో దానిని సాధించు కోవాలని కులవృత్తి సంఘాలు, వివక్ష మీద పోరాడుతున్న దళిత బహుజన సంఘాలు ఈ ఉద్యమంలో ముందుండాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తి తో “సంపద వికేంద్రీకరణ తో అందరికీ స్వతంత్ర జీవనం” అన్న నినాదంతో జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవాన్ని ఒక ప్రజా ఉద్యమంగా నిర్వహించాలని సభ నిర్ణయించింది
ఎఐటియుసి -సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధుల తోపాటు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, తణుకు స్టడీ సర్కిల్ డా రమేష్ చంద్రబాబు, సామాజిక న్యాయపోరాటసమితి గొల్లపల్లి అంబేద్కర్ ,లాయర్స్ యూనియన్ కామన మునుస్వామి సిపిఐ బొద్దాని నాగరాజు, సీనియర్ సిటిజన్స్ నాయకులు అడ్డాల సత్యనారాయణ, కరుణాకర చౌదరి,శ్రీ శ్రీ సేవాసమితి పి దక్షిణామూర్తి, రాజ్యాంగ పరిరక్షణ సమితి సంకు మనోరమ, ప్రజాసాహితి జి ఉష ,పౌరహక్కుల సంఘం కౌరు వెంకటేశ్వర్లు, షెడ్యూల్ కులాల సంక్షేమసంఘం కొండె నాగేశ్వరరావు,దళిత ఐక్యవేదిక పొట్ల సురేష్,దళిత క్రైస్తవ వేదిక అబ్రహాం, సైకిల్ రిపేర్ వర్క్ ర్స్ హజీబ్,టైలర్స్ యూనియన్ కె సుబ్బారావు , సమతా యువజనసంఘం రాజేష్,అంబేద్కర్ యువజన సంఘం ఏసు మునిబాబు తదితరులు పాల్గొన్నారు