48వ వార్డులో వీధి కుక్కలు స్వైర విహారం
వీధి కుక్కల బెడద నుంచి వార్డు ప్రజలను రక్షించండి
వార్డులో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి… సమస్యకు పరిష్కారం చూపాలి
48వ వార్డులో వీధి కుక్కలు స్వైర విహారం ఎక్కువగా ఉందని, వీధి కుక్కల బెడద నుంచి వార్డు ప్రజలను రక్షించాలని జీవీఎంసీ మేయర్ గోలగాని హరి వెంకటకుమారికి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమస్కరించి జీవీఎంసీ 48 వ వార్డు కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవితా అప్పారావు యాదవ్ వినతి అందజేశారు. 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉందని ముఖ్యంగా 1086271,1086272,1086273,1086276,1086277,1086281 సచివాలయం పరిధిలో మెట్ల పైన, చిన్న చిన్న సందుల్లోనూ, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ పాదచారులను, వాహనదారులను, వృద్ధులను, చిన్న పిల్లలను,పెద్దవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఇటీవల వార్డులో చాలా చోట్ల కుక్క కాటుకు గురై ఎంతోమంది ఆసుపత్రి పాలయ్యారని, కుక్క కాటు వల్ల వచ్చే రాబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనదని ప్రజలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.వార్డుల్లో పిచ్చి కుక్కలు ఎక్కువగా ఉండడంతో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీవీఎంసీ సిబ్బంది తూతూ మంత్రంగా కుక్కలను పట్టుకోవడం కోసం తిరుగుతున్నారని, ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి వీధి కుక్కల్ని పట్టుకొని ఈ బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ విషయంపై మేయర్ సానుకూలంగా స్పందించారని గంకల కవిత అప్పారావు యాదవ్ తెలిపారు.