సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్
గ్యాస్ సిలిండర్ కు ఏభై రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మోయలేని భారమని తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బుధవారం సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి భీమారావు మాట్లాడుతూ అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లి సరైన ఆదాయం లేక జీవనోపాధి అతికష్టంగా వుంటున్న పరిస్థితుల్లో పెరిగిన గ్యాస్ ధరలు పేదలకు తీవ్ర శరాఘాతం కానున్నాయన్నారు. అధిక ధరలు తగ్గిస్తామని, ప్రజల్లో కోనుగోలు శక్తిని పెంచుతామని పదకొండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పటికి పది పన్నెండు సార్లు పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగిందన్నారు. సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు మాట్లడుతూ అధిక ధరలు అరికడతాం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ వాగ్ధానాలు గుప్పించి అధికారంలోకి వచ్చిన మోడీ ధరలు తగ్గించడంలో పూర్తిగా విఫలం చెందారన్నారు.
ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సీపీఐ నాయకులు పుట్టాఅమ్మిరాజు, బొద్దాని మురళి కృష్ణ, మందుల ముత్తయ్య, బొద్దాని కృష్ణ కిషోర్, పత్తి రాజశేఖర్, పెన్మెత్స రాజు, సబ్బు నాగేశ్వర్రావు, బొద్దాని అప్పారావు, నుడగల అప్పారావు, బొబ్బిలి మురళీ, నూనె రాధాకృష్ణ, అక్కిన నాగేశ్వరావు, దేవాని వెంకటరత్నం, సారిపల్లి శ్రీరామ్ తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు.