వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్
రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం
తణుకు ఏఎంసీ పాలకవర్గం అభినందన సభ
తణుకులో ఏఎంసీ యార్డు నిర్మాణానికి చర్యలు
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హామీ
గత అయిదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన మొత్తం రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు దగా పార్టీగా వ్యవహరించిందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని మొత్తం మూత వేసేలా అప్పటి పాలకులు వ్యవహరించాలని విమర్శించారు. తణుకు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని తణుకు వీకే కన్వెన్షన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబునాయుడు రైతు పక్షపాతిగా వ్యవహరించి వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. రివర్స్ పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా దగా చేసిందన్నారు. కష్టపడి పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఎంసీలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, దేశ ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో కృషి చేస్తున్నారని అన్నారు. తణుకు ఏఎంసీను అభివృద్ధి చేయడానికి నూతన పాలకవర్గం కృషి చేయాలని కోరారు. తణుకు మార్కెట్ కమిటీకు సొంత స్థలం సేకరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి జెండాను ఎగరవేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా ఒక కుటుంబం అని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం మోసకారీ సంక్షేమాన్ని అమలు చేసిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో పదవుల జాతర ఉందని కూటమిలో కష్టపడిన ప్రతిఒక్కరిని గుర్తు పెట్టుకుని వారికి పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తణుకు ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివ మాట్లాడుతూ తణుకు మార్కెట్ కమిటీను ఎమ్మెల్యే రాధాకృష్ణ సహకారంతో అభివృద్ధి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్మోహన్రెడ్డి మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సారధ్యంలో మార్కెట్ కమిటీలను బలోపేతం చేస్తున్నారని అన్నారు. అనంతరం తణుకు ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివ, వైస్ ఛైర్మన్ వల్లూరి మోహన్‌లతోపాటు డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్య సభ్యులు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీమంత్రి పీతల సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, మున్సిపల్ మాజీ ఛైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, పరిమి వెంకన్నబాబు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ బసవా రామకృష్ణ, తణుకు పట్టణ టిడిపి అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, మాజీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి, జనసేన పార్టీ నాయకులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, చిక్కాల వేణు, ఆకేటి కాశీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.