వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకులో రైతు సంబరాల్లో భారీ ట్రాక్టర్ల ర్యాలీ
200 పైగా ట్రాక్టర్లతో రైతులు భారీ ప్రదర్శన
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. రైతు సంబరాల్లో భాగంగా దాదాపు 200 పైగా ట్రాక్టర్లు ర్యాలీగా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతా పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మంగళవారం తణుకులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వయంగా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ స్థానిక ఎన్టీఆర్ పార్కు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం, ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్డు, వేల్పూరు రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, ఆపిల్ ఆసుపత్రి, రాష్ట్రపతిరోడ్డు, వెంకటేశ్వర థియేటర్ సెంటర్ మీదుగా నరేంద్ర సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చంద్రబాబునాయుడు రైతులకు ఇచ్చిన సుఖీభవ పథకంలో తణుకు నియోజకవర్గంలోని 16,500 మంది రైతులకు రూ. 11.50 కోట్లు వారి ఖాతాల్లో రూ. 7 వేలు చొప్పు జమ చేసినట్లు గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయిన రూ. 1600 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించినట్లు తెలిపారు. గత అయిదేళ్ల కాలంలో సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఒక క్రమ పద్ధతిలో రైతులకు ఇబ్బందులకు రానీయకుండా నీటి సంఘాలను నియమించుకున్నట్లు తెలిపారు. కాలువల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన తూడు తొలగించిచడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్వా, దాళ్వాలో రైతులకు ఇబ్బందులు రాకుండా వారికి ఇష్టమైన చోట ధాన్యం విక్రయించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. 24 నుంచి 48 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో రైతులకు గోకులం షెడ్లు నిర్మించామన్నారు. రైతులకు కావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు వారి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. రైతులకు చెల్లించాల్సి బీమాను సైతం చెల్లించకుండా గత ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. గోనె సంచులు అడిగిన రైతులను సైతం పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కారుమూరి వెంకటనాగేశ్వరరావు అవహేళన చేశారని గుర్తు చేశారు. ధాన్యం డబ్బులు చెల్లించలేదని అడిగిన రైతులను సైతం ఎర్రిపప్ప అంటూ దుర్భాషలాడినట్లు చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.