అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 15 వతేదీ ఆదివారం తణుకులో జరుగనున్న అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశానికి కష్టమర్స్, ఏజెంటులు అధికసంఖ్యలో తరలిరావాలని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు కోరారు. శుక్రవారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసానికి గురై తీవ్రంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ సహకారంతో గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా ఉద్యమిస్తున్నామన్నారు. ఉద్యమ ఫలితంగా 10 వేలు 20, వేలు రూపాయల లోపు డిపాజిట్ల సొమ్ము పొందడం జరిగిందన్నారు. ఇంకా మిగిలిన బాధితులకు సుమారు 3 వేల 400 కోట్ల రూపాయలు చెల్లించవలసి వుందన్నారు. బాధితులకు పూర్తి న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటుకు, కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అంగీకరించిందన్నారు. ఇప్పటికే ఒత్తిడికి గురై ఆరువందల మంది చనిపోయారని ఇంకా ఎవరు చనిపోకుండా త్వరితగతిన బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి, అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించవలసిన డిపాజిట్ల సొమ్ముకన్నా అగ్రిగోల్డ్ ఆస్తులు నాలుగు రెట్లు అధికంగా వున్నాయని ప్రభుత్వం అగ్రి ఆస్తులు స్వాధీనం చేసుకుని బాధితులకు తక్షణ న్యాయం అందించాలన్నారు. అగ్రి ఆస్తులు మాఫియా చేతుల్లోకి పోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే వందలాది ఎకరాలు కబ్జాదారుల అధీనంలో వున్నాయని తక్షణమే కబ్జాదారుల నుంచి భూములు.స్వాధీనం చేసుకోవాలని భీమారావు డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా కార్యదర్శి వై. నాగలక్ష్మి, నూనె రామశ్రీను, జి. కొండయ్య, పి.శ్రీనువాసు, పి. పాల్ సింగ్, జె.వెంకటసత్యనారాయణ,నూనూనె రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
