జూన్ తొలి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా ప్రారంభం

:- వివరాలు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

త్వరలోనే పట్టాలెక్కనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, సూర్యలంక బీచ్ ఆధునికీకరణ పనులు

కుంభమేళా స్ఫూర్తితో 21 ప్రధాన పుణ్యక్షేత్రాల సమీపంలో పర్యాటకులకు తక్షణ వసతి సౌకర్యాలు కల్పించేలా చర్యలు

రాష్ట్రంలో హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు, లీజుకు మండువా లోగిళ్లు తీసుకునేలా ప్రణాళికలు

రాజమహేంద్రవరం: జూన్ మొదటివారంలో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని, పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులు, సూర్యలంక బీచ్ తదితర పర్యాటక ప్రాజెక్టుల వివరాలను మీడియాకు వివరించారు.

అఖండ గోదావరి ప్రాజెక్టుతో రాజమహేంద్రవరానికి మరింత పర్యాటక శోభ

పర్యాటకానికి ముఖ ద్వారమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా మరింత పర్యాటక శోభ సంతరించుకోనుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక ప్రాంతానికో, ఒక నియోజకవర్గానికో చెందనది కాదని రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి, పుష్కరఘాట్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర పర్యాటక ప్రాజెక్టు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు అఖండ గోదావరి ప్రాజెక్టును సమగ్ర పర్యాటక ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. అద్భుతమైన డీపీఆర్ తయారు చేసి రెండు మూడు పర్యాయాలు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన నేపథ్యాన్ని వివరించారు. ఈ అంశంలో సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఎంపీ పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టుపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అఖండ గోదావరి ద్వారా చారిత్రాత్మక హేవలాక్ వంతెనను ఆకర్షణీయంగా, సుందరంగా, పుష్కర్ ఘాట్ ను అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. బ్రిడ్జిలంకలో సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు. కడియం నర్సరీల అందాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నది తమ ఉద్దేశమన్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా తీర్చిదిద్దుతామన్నారు. నిడదవోలును, కోట సత్తెమ్మ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నామన్నారు.

వైఎస్సార్ కడప జిల్లా గండికోట ప్రాజెక్టుకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే కేంద్ర సహకారంతో నిధులు మంజూరయ్యాయని, గండికోటను గ్యాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సాహస పర్యాటకంలో భాగంగా కొండలు, లోయలు సాహస కార్యక్రమాలు అనువుగా ఉన్నాయన్నారు.

బాపట్ల జిల్లాలోని అద్భుతమైన సూర్యలంక బీచ్ ను మరింతగా ఆధునికీకరించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే కేంద్రం నుండి నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధికి నోచుకుంటుందని తెలిపారు. అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న సహజ సిద్ధమైన సూర్యలంక బీచ్ ఖ్యాతి మరింత పెంచుతామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఇక్కడ పనులు పూర్తయితే సూర్యలంక తీరం జాతీయ పర్యాటక హబ్ గా మారనుందన్నారు.

అడిగిన వెంటనే డీపీఆర్ లు తయారు చేసి ఇస్తున్న కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి మరిన్ని ప్రాజెక్టులు ఇస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ చెప్పారని మంత్రి దుర్గేష్ తెలిపారు. నాలుగైదు ప్రాజెక్టులకు డీపీఆర్ లు సిద్ధం చేసుకొని ఉంచితే ఏది బాగుంటే ఆ ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం తెలుపుతామని చెప్పినట్లు మంత్రి వివరించారు. ప్రతి ఏటా పీపీపీ విధానంలో కొన్ని ప్రాజెక్టులు, రెండు మూడు కేంద్ర ప్రాజెక్టులు తీసుకు వచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు.

కుంభమేళా స్ఫూర్తితో రాష్ట్రంలో 21 ప్రధాన పుణ్యక్షేత్రాల సమీపంలోని ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసే సర్క్యూట్ లలో పర్యాటకులకు వసతి సౌకర్యం కల్పించేందుకు వీలుగా టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇటీవల పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా వీటికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పర్యాటకులు రెండు మూడు రోజులు పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు వీలుగా తొలి ప్రాధాన్యతగా టెంట్ సిటీలు,హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండువాలోగిళ్లను లీజుకు తీసుకొని గ్రామాల్లో గడిపేలా చర్యలు చేపట్టామన్నారు. శ్రీశైలంలో అన్ని రకాల పర్యాటక ప్రదేశాలను పర్యాటకులు చూసేలా ప్రణాళికలు చేశామన్నారు. ఇప్పటికే స్టార్ హోటళ్లకు కేబినెట్ ఆమోదం తెలిసిందన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

Scroll to Top
Share via
Copy link